సాంప్రదాయం అనే ఎడారిలో హేతువు ఇంకిపోతే మిగిలేది ’తంతు’ మాత్రమే. కాని జానపద సాహిత్యం, కళలు అనేవి కాలం పరీక్షకు నిలిచి, నిగ్గుతేలిన నికార్సయిన సంపద. ప్రత్యేకించి బాల సాహిత్యంలో జానపద కథలని చెప్పుకునే ‘ఫోక్ టేల్స్’ ఎంతో విలువైనవి. ఇవి సార్వజనీనమైనవి, అన్ని కాలాల పిల్లలను అలరించేవి.
అద్భుత ఊహా ప్రపంచంలోకి జానపద కథలు పిల్లల్ని తీసుకెళతాయి. భయంకొలిపే రాక్షసులు, మాట్లాడే పశుపక్ష్యాదులు, సొరంగ మార్గాలు, ఒంటి స్తంభం మేడలు, మాయలు మంత్రాలు ఈ కథల్లో కనిపిస్తాయి. అంతేకాదు వీటిల్లో అసూయద్వేషాలు, కుట్రలు కుతంత్రాలు, మంచి చెడులు, ధైర్యసాహసాలు వంటివి ఉంటాయి. ఈ రకంగా ఈ కథలు పిల్లల్ని తమ అంతరంగంలోకి వెళ్ళేలా చేసి తాము ఎవరి పక్షాన ఉన్నారో తేల్చుకోమంటాయి. తమ కథా శిల్పంతో పిల్లల్ని మంత్రముగ్థుల్ని చేస్తాయి. అందుకే ఈ కథలకు ఇంకా వన్నె తగ్గని ఆకర్షణ.
‘సస్యసుందరి’ అన్న కథలో దద్దమ్మ అనుకున్న రాకుమారుడే అందరిలోకి అందమైన భార్యని తెచ్చుకున్నాడు. మొదట చెంచాలో పట్టేంత చిన్నగా ఉన్న ఆమె జయశేఖరుని ప్రేమకు పూర్ణరూపం సంతరించుకుంటుంది. అలాగే ‘శ్వేత భల్లూకం’ అన్న కథలో ఎలుగుబంటి రూపంలో ఉన్న రాకుమారుడినీ, ‘మూషిక రంధ్రం’ కథలో కప్ప రూపంలొ ఉన్న ప్రియురాలిని ఆ కథల్లోని నాయికా, నాయకులు తమ సహనం, శక్తి యుక్తులతో అందుకోగలుగుతారు. యక్షప్రశ్నలకు బదులిచ్చి తన తమ్ముళ్ళను సాధించుకున్న ధర్మరాజు మాదిరి ‘బుధ్ధిబలం’ అన్న కథలో రాక్షసుడి ప్రశ్నలకు బదులిచ్చి తన అన్ననే కాకుండా రాకుమారిని భార్యగా పొందుతాడు.
పందెంలో గెలిచినా బీద గొర్రెలకాపరికి తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చెయ్యకూడదనుకున్న కోయరాజు భంగపడిన విధానం ‘పోయిన బల్లెం’లో కనపడితే, ‘స్వర్ణపేటిక’ అన్న కథలో రాజగురువు తన శిష్యురాలైన రాకుమారిని మోహించి, ఆమెను పొందుదామని కుట్రపన్నుతాడు. కాని, విఫలమౌతాడు. అలాగే ‘వీరన్న శౌర్యం’లో సవతి తల్లి ద్వేషం గాని, నావికుడి మోసంగాని వీరన్నని తన గమ్యంనుంచి దూరం చెయ్యలేకపోయాయి.
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడని అంటారు. కాని, ఆ పూజారి పాత్ర మనలోని దురాశ పోషిస్తే ఏమవుతుందో ‘మూడు కోరికలు’ చదివితే తెలుస్తుంది. సముద్రపు నీరు ఉప్పగా ఎందుకు ఉంది? ఒకప్పటి ప్రజలు తమ ఊహాశక్తి ఆధారంగా అల్లుకున్న కథే ‘అసలు రహస్యం’. ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక్కొక్క కథ ఒక్కొక్క ఆణిముత్యం అవుతుంది. వాటి పరిచయాలు చాలించి అబ్బూరి ఛాయాదేవి శైలిలోని అసలు కథల్లోకి వెళ్ళండి.
ప్రతులకు: మంచి పుస్తకం
మంచి పుస్తకానికి
ReplyDeleteజానపద కధల లో బాలల కధల ప్రస్తావన చాలా బావుంది. జానపద కధలలో కల్పనలకి ఉన్న అర్ధాన్ని బాగా చెప్పారు. చాయాదేవి అంటే ఎవరు? అబ్బూరి చాయా దేవా? ఈ పుస్తకాన్ని కొని చదవాలని ఉంది...
రామ చంద్రుని మనోధర్మం