పుస్తకాలను మించి స్నేహితులు ఉండరని అంటారు. అట్లాంటి స్నేహం పిల్లలకు చిన్నప్పటినుంచి ఏర్పడితే! అంతకంటే కావలసింది ఏముంది?
నేర్చుకోవడం అన్నది పిల్లల సహజ గుణం. మరీ చిన్నప్పుడు వాళ్ళు ప్రతిదీ నోటి ద్వారా తెలుసుకోవాలని అనుకుంటుంటారు. ఒక దశలో వాళ్ళ చేతికి దినపత్రిక దొరికితే చాలు ఆడుతూ చించి పెడతారు. పుస్తకాల పేజీలు తమంతట తాము తిప్పటానికి ప్రయత్నిస్తారు. చిన్న పిల్లలకి ఒక పుస్తకం కొనిస్తే వాళ్ళకి చదవటం రాకపోయినా, కనీసం పేజీలు తిప్పటం రాకపోయినా దానిని తమకు ఇవ్వమని మారాం చేస్తారు. తమ గుండెలకు హత్తుకుని ’ఇది నాది’ అంటారు. ఈ చిన్ని ఆనందాలను పిల్లలు పొందేలా పెద్దలు అనుమతించాలి.
తమకు, తమ పిల్లలకు తినుబండారాలు కొనడానికి చాలామంది లెక్కచెయ్యకుండా ఎంతో ఖర్చు చేసేస్తుంటారు. కానీ పుస్తకాలు కొనడానికి వచ్చేసరికి ఖర్చు చేయడానికి ఎంతో తటపటాయిస్తుంటారు. ఒకవేళ పుస్తకం కొంటే అది నలగకూడదని, పాడైపోకూడదని ఇదైపోతుంటారు. దీని వల్ల పిల్లలు పుస్తకాలను ఆస్వాదించలేని, ఆనందించలేని పరిస్థితి ఏర్పడవచ్చు.
పుస్తకాన్ని జాగ్రత్తగా చూసుకోవటం మంచిదే. పేజీలు తిప్పేటప్పుడు నలగకుండా చూడటం, చదువుతున్న పేజీకి గుర్తుగా ’బుక్మార్క్’ పెట్టుకోవటం వంటి వాటి వల్ల చదివినా పుస్తకం నలగకుండా ఉంటుంది. పుస్తకానికి అట్ట వేస్తే కూడా ఎక్కువ కాలం మన్నుతుంది. అయితే ఇవన్నీ ఒక వయస్సు వచ్చిన తరువాత చెయ్యవలసిన పనులు.
చిన్న పిల్లల విషయంలో మాత్రం ’పుస్తకం చిరగటం మంచిదే’ అన్న సూత్రాన్ని పాటించాలి. అంతగా అయితే పాత చందమామ, వార పత్రిక, ఆదివారం మ్యాగజైన్ వంటి పుస్తకాలను ఇచ్చి పిల్లలు వాటి పేజీలు తిప్పటం, తిరగెయ్యటం నేర్చుకునేలా చెయ్యాలి.
(పుస్తకాలతో స్నేహం బులెటిన్ 1, డిసెంబరు 2008 నుండి.)
No comments:
Post a Comment