Tuesday, March 17, 2009

ఖలీల్ జిబ్రాన్ ’ది ప్రాఫెట్’ కి కాళోజిగారి అనువాదం

కాళోజిగారు ఖలీల్ జిబ్రాన్ ’ది ప్రాఫెట్’ని తెలుగులోకి ’జీవన గీత’ పేరుతో అనువదించారు. దీనిని యువభారతి వారు అప్పట్లో ప్రచురించారు. ఆ తరువాత కూడా దీనిని కొంత మంది అనువదించారు. నేను అనువదించినది హెచ్ బి టి ’జీవన గీతం’ గా ప్రచురించింది.

కాళోజిగారి అనువాదాన్ని ఇక్కడ చూడవచ్చు:

http://openlibrary.org/b/OL23135178M/జీవన-గీత

’ది ప్రాఫెట్’కి నా అనువాదంనుంచి ఒక భాగం:

మీ పిల్లలు మీ పిల్లలు కారు.
తనను తాను కోరుకునే జీవితపు కొడుకులూ, కూతుళ్ళూ వారు.
వారు మీ ద్వారానే వస్తారు కాని మీ నుంచి కాదు.
మీతో ఉన్నప్పటికీ వాళ్ళు మీకు చెందరు.


వారికి ప్రేమను ఇవ్వవచ్చు, కాని మీ ఆలోచనలను ఇవ్వవద్దు:
వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి.

వాళ్ళ శరీరాలకు ఆశ్రయం ఇవ్వవచ్చు కాని వాళ్ళ ఆత్మలకు కాదు:
మీ కలల్లో సైతం చూడలేని రేపటి ఇళ్ళల్లో వాళ్ళ ఆత్మలు ఉంటాయి.

వారిలాగే మీరు ఉండటానికి మీరు ప్రయత్నించవచ్చు, కాని మీలాగా వారిని చెయ్యటానికి పూనుకోవద్దు:
జీవితం వెనక్కి నడవదు, నిన్నటితో కాలయాపన చెయ్యదు.


మీ పిల్లలు సజీవులైన బాణాల మాదిరి విడవబడేందుకు ఉపయోగపడే విల్లు మీరు.

అనంతపథంలోకి గురి చూసి బాణాలు వేగంగా, దూరానికి చేరుకునేలా తన శక్తినంతటితో విలుకాడు విల్లుని వంచినట్లు మిమ్మల్ని వంచుతాడు.

విలుకాడు చేతిలో మీరు వంచబడటం సంతోషంకోసమే కానివ్వండి;

దూసుకుపోతున్న బాణాన్ని ప్రేమించినట్లే చేతిలో స్థిరంగా ఉన్న విల్లునీ అతడు ప్రేమిస్తాడు.