Tuesday, March 17, 2009

ఖలీల్ జిబ్రాన్ ’ది ప్రాఫెట్’ కి కాళోజిగారి అనువాదం

కాళోజిగారు ఖలీల్ జిబ్రాన్ ’ది ప్రాఫెట్’ని తెలుగులోకి ’జీవన గీత’ పేరుతో అనువదించారు. దీనిని యువభారతి వారు అప్పట్లో ప్రచురించారు. ఆ తరువాత కూడా దీనిని కొంత మంది అనువదించారు. నేను అనువదించినది హెచ్ బి టి ’జీవన గీతం’ గా ప్రచురించింది.

కాళోజిగారి అనువాదాన్ని ఇక్కడ చూడవచ్చు:

http://openlibrary.org/b/OL23135178M/జీవన-గీత

’ది ప్రాఫెట్’కి నా అనువాదంనుంచి ఒక భాగం:

మీ పిల్లలు మీ పిల్లలు కారు.
తనను తాను కోరుకునే జీవితపు కొడుకులూ, కూతుళ్ళూ వారు.
వారు మీ ద్వారానే వస్తారు కాని మీ నుంచి కాదు.
మీతో ఉన్నప్పటికీ వాళ్ళు మీకు చెందరు.


వారికి ప్రేమను ఇవ్వవచ్చు, కాని మీ ఆలోచనలను ఇవ్వవద్దు:
వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి.

వాళ్ళ శరీరాలకు ఆశ్రయం ఇవ్వవచ్చు కాని వాళ్ళ ఆత్మలకు కాదు:
మీ కలల్లో సైతం చూడలేని రేపటి ఇళ్ళల్లో వాళ్ళ ఆత్మలు ఉంటాయి.

వారిలాగే మీరు ఉండటానికి మీరు ప్రయత్నించవచ్చు, కాని మీలాగా వారిని చెయ్యటానికి పూనుకోవద్దు:
జీవితం వెనక్కి నడవదు, నిన్నటితో కాలయాపన చెయ్యదు.


మీ పిల్లలు సజీవులైన బాణాల మాదిరి విడవబడేందుకు ఉపయోగపడే విల్లు మీరు.

అనంతపథంలోకి గురి చూసి బాణాలు వేగంగా, దూరానికి చేరుకునేలా తన శక్తినంతటితో విలుకాడు విల్లుని వంచినట్లు మిమ్మల్ని వంచుతాడు.

విలుకాడు చేతిలో మీరు వంచబడటం సంతోషంకోసమే కానివ్వండి;

దూసుకుపోతున్న బాణాన్ని ప్రేమించినట్లే చేతిలో స్థిరంగా ఉన్న విల్లునీ అతడు ప్రేమిస్తాడు.

8 comments:

  1. ఔనా - చాలా అనువాదాల ఉన్నాయా!

    మీ గురించి సరిగా ఎక్కడేలేదే! ఐ మీన్ మీ పేరు, ఇతర రచనలు అబౌట్ లో పెడితే క్లారిటీ ఉండేదేమో.


    నేను మొన్నీమధ్య "సెల్ఫ్ నాలెడ్జ్" ని "ఆత్మఙ్ఞానం" అని అనువదించుకున్నాను.మీరిచ్చిన లింకులో కాళోజీ గారు దానికి ఏం రాశారు చదివేశాను ఆత్రంగా!ఆఆఆ ప్....ఎందుకో నాదే నాకు బావుంది :)

    కాకతాళీయంగా ఇవ్వాళ్ళే దాన్ని వేరే వాళ్ళకి చదవమని లింకేసేను!మీకు కూడా :
    http://rayraj.wordpress.com/2009/01/15/%e0%b0%86%e0%b0%a4%e0%b1%8d%e0%b0%ae%e0%b0%99%e0%b0%be%e0%b0%a8%e0%b0%82-2/

    మీకేమనిపించిందో చెప్తే (మీదే మీకు నచ్చింది అనైనా) ఆనందిస్తాను.మీ పుస్తకం కూడ సంపాదించి చూస్తాను లెండి / లేక పోతే ఈ ఒక్క కవిత మీరే వేసెయ్యరాదు! :)

    ReplyDelete
  2. టాగోర్ గీతాంజలివి 25కి పైగా అనువాదాలు ఉన్నాయంట! ఖలీల్ అంతగా అనువదింపబడకపోయినా, అతనివీ, పూర్తిగానూ, పాక్షికంగానూ చాలానే అనువాదాలు ఉంటాయి.

    నా పేరు సురేష్, అనువాదాలు (మాత్రమే) చెయ్యటం ఇష్టం. ఇటీవలి ’పరుసవేది’ (The Alchemist by Paulo Coelho), మొదటి ’గడ్డి పరకతో విప్లవం’ (The One Straw Revolution by Masanobu Fukuoka) బాగా ఆదరణ పొందాయి.

    ReplyDelete
  3. సురేష్ గారికి
    నమస్తే,

    జిబ్రాన్ రచనలపై ఎప్పటినుంచో నాకాశక్తి. అద్బుతమైన వేదాంతధోరణితో సాగే సరళ ప్రవచనాలు అవి.

    కాళోజీ గారు అనువదించారని విన్నాను కానీ పుస్తకం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

    మీ పుణ్యమాని ఆ అదృష్టం కలిగింది. ధన్యవాదములు.
    పరుసవేది చదివాను. చాలా బాగుంది. నచ్చింది.

    జిబ్రాన్ కొన్ని సూక్తులను అనువదించాలని ఎప్పటినుంచో అనుకొంటున్నాను. ప్రస్తుతం టాగోర్ క్రెసెంట్ మూన్ అనువాదం చేస్తున్నాను. ఈ శలవలు ముగిసేలోగా ప్రయత్నించాలి.
    టాగోర్ స్ట్రే బర్డ్స్ కు నే చేసిన అనువాదం మీకు ఆశక్తి కలిగితే ఇక్కడ చూడండి.
    http://www.scribd.com/doc/9674265/Tagore-Stray-Birds-Telugu-Translation

    మంచి అనువాదాన్ని రుచి చూపించారు. ధన్యవాదములు

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  4. ప్రాఫెట్ లో పిల్లలగురించిన ఈ ఖండిక నాకు చాలా ఇష్టం. తలిదండ్రుల పాత్రలోని సారాన్ని ఇందులో పిండేశాడు అనిపిస్తుంది. మీ అనువాదం సరళంగా ఉంది,

    ReplyDelete
  5. miru 'the alchemist' anuvadakula?!!! happy to meet u sir...parusavedi chala chala baagundi...hyd book fair lo atram gaa koni ,chadivi 8 months ayinaa..aa freshness inkaa vadalledu..thanq sir.

    ReplyDelete
  6. Hi,

    Welcome to gsystime.blogspot.com

    the knowledge not ends entire the universe -
    for specific knowledge you read this blog

    ReplyDelete